కరోనా సోకిందనే భయంతో ఆత్మహత్య

Published on May 02,2020 02:00 PM
ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని రామంతాపూర్ లో ఘోరం జరిగింది. తనకు కరోనా సోకిందనే భయంతో వాసిరాజు కృష్ణమూర్తి (60) అనే వ్యక్తి బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి వెళదామని అనుకుంటున్న సమయంలో కరోనా భయంతో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. రామంతాపూర్ లో ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. వాసిరాజు కృష్ణమూర్తి అనే వ్యక్తి రామంతాపూర్ లో నివాసం ఉంటున్నాడు. అయితే కొద్దిరోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నాడు.

కరోనా లక్షణాలలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా ఒక లక్షణం కాబట్టి తనకు కరోనా సోకిందనే భయపడేవాడు. ఆ భయంతోనే కింగ్ కోటి లోని ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నాడట కూడా. అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కరోనా లేదని ఇంటికి పంపించారు. అయితే ఇంటికి వచ్చాక కూడా శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతుండటంతో మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అయితే తనకు కరోనా సోకిందనే భయం తలెత్తడంతో పైనుండి దూకేసాడు దాంతో అక్కడికక్కడే చనిపోయాడు వాసిరాజు కృష్ణమూర్తి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.