చిరు సినిమాకు ఆ టైటిల్ ఫిక్స్ చేసినట్లేనా ?

Published on Dec 26,2019 16:32 PM

మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. సందేశాత్మకంగా రూపొందుతున్న ఆ చిత్రానికి '' గోవిందా హరి గోవింద'' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఈ టైటిల్ ని ప్రకటించలేదు కానీ తాజాగా అందుతున్న సమాచారం అయితే ఇదే టైటిల్ అని తెలుస్తోంది. ఇంతకుముందు కూడా ఇదే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది అయితే అప్పుడు మాత్రం ఆ వార్తలను ఖండించారు కట్ చేస్తే ఇప్పుడు ఇదే టైటిల్ '' గోవిందా హరి గోవింద '' ఖరారు అయినట్లు తెలుస్తోంది.

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ సామాజిక సందేశాన్ని ఇస్తూనే కమర్షియల్ చిత్రంగా మలుస్తాడు అనే పేరుంది. ఇప్పటివరకు కొరటాల దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ ఇలాగే రూపొందాయి కూడా. దాంతో అదే కోవలో చిరు - కొరటాల సినిమా'' గోవిందా హరి గోవింద '' కూడా ఉండనుంది అని తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డి లాంటి చిత్రం తర్వాత చిరు నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని కూడా చరణ్ నిర్మిస్తుండటం విశేషం.