టాలీవుడ్ వైజాగ్ కు తరలిపోనుందా ?

Published on Dec 27,2019 22:36 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజధాని వైజాగ్ కు మార్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్న తరుణంలో టాలీవుడ్ వైజాగ్ కు తరలిపోనుందా ? అన్న చర్చ మొదలయ్యింది. గతంలో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగిన రోజుల్లో రాష్ట్రం కనుక విడిపోతే తెలుగు చిత్ర పరిశ్రమ వైజాగ్ కు తరలి వెళ్లడం ఖాయమని అనుకున్నారు. అంతేకాదు అప్పట్లో టాలీవుడ్ బడా నిర్మాతలు వైజాగ్ తో పాటుగా దాని పరిసర ప్రాంతాలు అలాగే నెల్లూరు తడ దగ్గర కూడా పెద్ద మొత్తంలో భూములు కొన్నారు స్టూడియోల కోసం.

అయితే తెలంగాణ ఏర్పడ్డాక చిత్ర పరిశ్రమ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూల వైఖరి అవలంభిస్తుండటంతో టాలీవుడ్ ఎక్కడికి పోదని , ఇక్కడే ఉంటుందని పైగా ఇపుడు అంతా డిజిటల్ యుగం కనుక ఎవరు ఎక్కడ ఉన్నా ఫరవాలేదని చెబుతున్నారు కూడా. అయితే అనూహ్యంగా ఏపీ రాజధాని అమరావతి నుండి వైజాగ్ కు తరలించాలని జగన్ ప్రభుత్వం ఆలోచనకు వస్తుండటంతో మళ్ళీ టాలీవుడ్ వైజాగ్ తరలిపోనుందా ? అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే అక్కడ చాలామందికి భూములు ఉన్నాయి పైగా అక్కడి ప్రభుత్వం తో సఖ్యతగా ఉండి భూములను , రాయితీలను పొందాలని భావించే వాళ్ళు టాలీవుడ్ ని వైజాగ్ కు తరలించాలనే ప్రతిపాదన చేస్తున్నట్లు తెలుస్తోంది.